Review: చిన్న బడ్జెట్ – మంచి అవుట్‌పుట్.. కాలమేగా కరిగింది రివ్యూ!!

Review: నటీనటులు: వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార, అశ్వత్ తదితరులు దర్శకత్వం: శింగర మోహన్ నిర్మాత: మరే శివశంకర్ సినిమాటోగ్రఫి: వినీతి పబ్బతి మ్యూజిక్ డైరెక్టర్: గుడప్పన్ ఎడిటర్: యోగేష్ బ్యానర్: శింగర క్రియేటివ్ వర్క్స్ రిలీజ్ డేట్: 2025-03-21
Kalamega Karigindi Review
‘కాలమేగా కరిగింది’ చిత్రం వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ముఖ్య పాత్రల్లో రూపొందింది. శింగర మోహన్ దర్శకత్వంలో, మరే శివశంకర్ నిర్మాణంలో శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ప్రేమను కలహాలు లేని కోణంలో చూపించే ఈ చిత్రానికి “కలహాలే లేని ఓ ప్రేమకథ” అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూర్తి పొయిటిక్ స్టైల్‌లో రూపొందిన ఈ సినిమా, ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 21న థియేటర్లలో విడుదలైంది. వినూత్నంగా రూపొందిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో ఈ సమీక్ష లో తెలుసుకుందాం.
కథ : పోరుమామిడి గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న ఫణి, బిందు చిన్న వయసులోనే ఆకర్షణకు లోనవుతారు. కాలక్రమేణా వారి స్నేహం ప్రేమగా మారి, గాఢత పెరుగుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల్లో వారి ప్రేమకథకు విరామం ఏర్పడుతుంది. వారిని వేరుచేసిన కారణం ఏమిటి? వారి జీవితాల్లో ఈ విరహం ఎందుకు వచ్చిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. చివరికి వారు మళ్లీ కలుసుకున్నారా? వారి ప్రేమకథకి ఎలాంటి ముగింపు లభించింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు: అరవింద్ – నోమిన తార స్కూల్ జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం ప్రధానంగా ఈ ఇద్దరి మధ్యే సాగుతుంది. స్కూల్ ప్రేమికులుగా ఎంతో క్యూట్‌గా కనిపించి, సహజమైన నటనతో మెప్పించారు. రాజు స్కూల్ ఫ్రెండ్ పాత్రలో కొన్ని చోట్ల నవ్వులు పంచుతాడు. ఫణి పాత్రలో వినయ్ కుమార్ పెద్దయ్యాక గంభీరంగా, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అందించాడు. శ్రావణి ఒక్క సీన్‌లో మాత్రమే కనిపించినప్పటికీ, సింపుల్‌గా ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలలో నటించిన వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా మొత్తం స్కూల్ ప్రేమకథను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారనే చెప్పాలి.
సాంకేతిక నిపుణులు: దర్శకుడు శింగర మోహన్ రాసిన కథతో, “కాలమేగా కరిగింది” కలహాలే లేని ఓ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన కథను తీర్చిదిద్దిన విధానం కవితా శైలిని తలపిస్తుంది. ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ, ప్రతి పాట కథలోని భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తీకరించాయి. కథను చూడటం కంటే, దర్శకుడు నిజంగానే అనుభవించి, హృదయంతో చెప్పినట్టుగా అనిపిస్తుంది.
సినిమా మొదటి భాగం కథానాయకుడి చిన్ననాటి జ్ఞాపకాలు, తన తొలి ప్రేమను తలచుకోవడం చుట్టూ తిరుగుతుంది. కథనం సుతారంగా సాగినప్పటికీ, తల్లిదండ్రుల పాత్రలను మరింత వేళ్ళబెట్టే అవకాశం కనిపిస్తుంది. సినిమా పథాన్ని మార్చకుండానే మొదటి భాగం మంచి ముగింపుతో ప్రేక్షకులను రెండో భాగంలోకి తీసుకెళ్తుంది. అయితే, అక్కడ కథనం కొంత నెమ్మదిగా మారిపోతుంది. ఊహించదగిన మలుపులతోనే కథ సాగడం ప్రేక్షకులను కొంత అసంతృప్తిపరచవచ్చు. రెండో భాగం ఎక్కువగా ఒకే భావోద్వేగంలో కొనసాగుతూ, కొత్త మలుపుల్లేక కథను ముందుకు నడిపించడం కాస్తంత నెమ్మదిస్తుంది.
సంగీత దర్శకుడు గూడప్పన్ అందించిన పాటలు ప్రేమ భావోద్వేగాలను తాకేలా ఉన్నాయి. సహజమైన, వాస్తవిక లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు విజువల్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయి. గాయకుల అనుభూతితో పాడిన పాటలు, నేపథ్య సంగీతం కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో సంగీతం సినిమా హృదయాన్ని ఎలివేట్ చేయడంలో కీలకపాత్ర పోషించింది.
సినిమాటోగ్రఫీ వినీత్ పబ్బతి అద్భుతంగా హ్యాండిల్ చేసారు. రంగుల సమ్మేళనం, కెమెరా యాంగిల్స్, నైట్రల్ టోన్స్—వీటితో కథను మరింత అందంగా మలిచారు. ప్రతి ఫ్రేమ్ ఓ కవితలా అనిపించేలా తీర్చిదిద్దారు. అయితే, రా యోగేష్ ఎడిటింగ్ కొంత బాగుండినా, కథనం నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్లు అనిపించవచ్చు.
ప్లస్ పాయింట్స్:
కెమెరా వర్క్ & విజువల్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
చిన్న బడ్జెట్ – మంచి అవుట్‌పుట్
మైనస్ పాయింట్స్:
పాత కథ
రెండో అర్థ భాగం నెమ్మదిగా సాగుతుంది
‘కాలమేగా కరిగింది’ ఒక కవితాత్మకమైన ప్రేమకథ. మంచి విజువల్స్, మ్యూజిక్, డైలాగ్స్, చిన్న బడ్జెట్ లో క్వాలిటీ అవుట్‌పుట్ ప్లస్ పాయింట్స్. కానీ కథ పాతదనంగా ఉండడం, రెండో భాగం నెమ్మదించడం, ఊహించదగిన మలుపులు లేకపోవడం మైనస్. క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చే సినిమాగా మిగిలిపోయింది.
⭐ రేటింగ్: 3/5