టాలీవుడ్ లో సమ్మెకు పరిష్కారం దొరకడం లేదు. నిన్న నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య జరిగిన చర్చల్లో సయోధ్య కుదరలేదు. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల సమ్మె కొనసాగుతోంది. షూటింగ్స్ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ సమ్మె మరికొద్ది రోజులు కొనసాగితే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి పెట్టుకున్న సినిమాలు అనుకున్న డేట్ కు విడుదల చేయడం కష్టంగా మారుతుంది.
సినీ కార్మికులు తమకు 30శాతం వేతనాలు పెంచాలని అడుగుతున్నారు. నిర్మాతలు 20 పర్సెంట్ వరకు పెంచేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే తాము నిర్దేశించిన పని గంటలు సినీ కార్మికులు పాటించాలని నిర్మాతలు కోరుతున్నారు. నిర్మాతలు చెబుతున్న పనిగంటలు తమకు సాధ్యం కాదని సినీ కార్మికులు అంటున్నారు. మరో రెండు మూడు సార్లు చర్చలు జరిగితే ఏదైనా పరిష్కారం లభిస్తుందని నిన్న మీటింగ్ లో పాల్గొన్న ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు.





