Shabhad Reward: రూ. 2 లక్షల రివార్డు.. ఎస్సై సస్పెన్షన్

షాబాద్ లో ఆరుగురిని కిరాతకంగా హతమార్చిన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అతడి కోసం రూ. 2 లక్షల రివార్డు ప్రకటించడంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన షాబాద్ ఎస్సై రమేశ్‌ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజీ, టోల్ ప్లాజా డేటా సేకరిస్తూ పది ప్రత్యేక బృందాలు రంగంలో ఉన్నాయి.

రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ నిందితుడిని ఎలాగైనా పట్టుకుంటామని, బాధ్యులెవరినీ వదిలిపెట్టమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితుడు రాజ్‌కుమార్ పక్కా ప్లానింగ్ తోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోక్సో కేసు ఆగ్రహావేశంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.

షాబాద్ పిఆర్ స్టేడియం దగ్గర మైనర్ బాలిక (17) ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్ ఆమెను లాక్కెళ్లే ప్రయత్నంలో తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత బాలికను అఖిల్ సాగర్ చెరువు దగ్గర గొంతు కోసి హతమార్చాడు. చివరగా దైవాలగూడలోని తన ఇంటికి వెళ్లి భార్య సరిత (33), ఇద్దరు కొడుకులు పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2) ను కూడా కిరాతకంగా చంపేశాడు.

ఒకే పోక్సో కేసు కక్షతో ఇంత పెద్ద కుటుంబాన్ని బలితీసుకున్న ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. రాజ్‌కుమార్ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల రివార్డు ప్రకటించడంతో పాటు, ఎవరైనా నిందితుడికి సాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Share your love