హైదరాబాద్ నగరంలో వరద ముప్పును తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన SNDP funds కేటాయింపుల్లో జరుగుతున్న ఆలస్యం వల్ల నాలాల పునరుద్ధరణ పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాకపోవడంతో చాలా చోట్ల పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,650 కోట్లు బడ్జెట్ లో కేటాయించినా, ఇప్పటివరకు త్రైమాసిక వాటా కూడా విడుదల కాలేదు. దీంతో కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేపడతామంటూ చేతులెత్తేశారు.
SNDP funds crisis delays work
రెండున్నరేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, మొదటి దశ పనులు పూర్తి చేయలేకపోయింది. రెండో దశలో 57.401 కి.మీ. నాలాలకు రూ.667.28 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించినా, టెండర్ల దశలోనే కాలయాపన జరుగుతోంది. చాలా ప్రాంతాల్లో నాలాలు సగం తవ్వి వదిలేయడం, పనుల ప్రతిపాదనలు టెండర్ల దాటకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం రాగానే అదే వరద, అదే సమస్య అన్నట్లుగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వేసవి కాలంలో పనులు చకచకా పూర్తి చేయడానికి అనుకూలమైన సమయం కూడా ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇప్పుడు వర్షాకాలం మొదలైన దరిమిలా మళ్లీ వరద ముప్పు తలెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిద్రపోలేని పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్లలో వరదలతో ఉక్కిరిబిక్కిరైన కాలనీ వాసుల భయాన్ని తొలగించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
ప్రధాన నాలాల విస్తరణ, బాక్స్ డ్రైన్ల నిర్మాణం వంటి కీలక పనులు అర్థాంతరంగా నిలిచిపోవడంతో ప్రతి వర్షానికి నగరవాసులు భయపడుతున్నారు. జీహెచ్ఎంసీ కూడా బిల్లులు సరిగ్గా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేసారు. ఇలాంటి పరిస్థితుల్లో వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడటం ఎలా అనే ప్రశ్న వేధిస్తోంది. నిధుల కొరతను అధిగమించకపోతే SNDP ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమే.





