
నేటితరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని బోల్డ్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. రాధ్య, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గ్లామర్, యాక్షన్, ఎమోషన్‌తో పాటు సామాజిక కోణాన్ని మేళవించిన కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథా నేపథ్యం
అరిజోనాలోని ఓ పబ్ చుట్టూ కథ ప్రధానంగా సాగుతుంది. ఆ పబ్‌ను నిర్వహించే మైక్ (కబీర్ సింగ్) డబ్బు కోసం అమ్మాయిలను తన వ్యాపారంలోకి లాగుతూ క్రూరంగా వ్యవహరిస్తుంటాడు. భవిష్యత్తులో ఐలాండ్‌లో భారీ రిసార్ట్‌లు, పబ్‌లతో వంద కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాలన్నది అతని లక్ష్యం. ఈ పరిస్థితుల్లో విన్ని (రాధ్య) అనుకోకుండా అతని వలలో చిక్కుతుంది. మరోవైపు భారత్ నుంచి ఈషా, ఈవ్, బేబ్ అనే ముగ్గురు యువతులు కూడా అక్కడికి చేరుకుంటారు. వారు భారత్‌ను ఎందుకు విడిచి వెళ్లాల్సి వచ్చింది? మైక్ బారి నుంచి నలుగురూ ఎలా బయటపడ్డారు? వారి జీవితాల్లో ‘రెడ్ బ్యాగ్’కు ఉన్న సంబంధం ఏమిటి? చివరికి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.
సినిమా హైలైట్స్
కథ కథనాలు
దర్శకుడు రవి కుమార్ సీరపు ఎంచుకున్న కథలో కొత్తదనం కంటే దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా స్టైలిష్ టేకింగ్‌తో కథను ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లే ద్వారా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. కథలోని ఎమోషనల్ అంశాలను యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో కలిపిన తీరు మెప్పిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
విన్నిగా రాధ్య తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామరస్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన ముగ్గురు హీరోయిన్లు కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. కబీర్ సింగ్ క్రూరమైన విలన్ పాత్రలో విభిన్నమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రసాద్ బెహరా తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచగా, రాశీ తనకు లభించిన పరిమిత పాత్రలోనూ గుర్తుండిపోయే ఇంపాక్ట్ చూపించింది.
సెకండాఫ్ & క్లైమాక్స్
సినిమా ప్రథమార్థం ప్రధానంగా పాత్రల భావోద్వేగాలు, వారి నేపథ్యాలను పరిచయం చేస్తూ సాగుతుంది. సెకండాఫ్‌లో కథ వేగం పెరిగి ఛేజింగ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఉత్కంఠను పెంచుతుంది. ముఖ్యంగా సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొనే తల్లి బాధను, ఆమె కోసం కూతుళ్లు చేసే పోరాటాన్ని ఎమోషనల్‌గా చూపించిన విధానం సినిమాకు బలంగా నిలుస్తుంది. క్లైమాక్స్‌లో రివేంజ్ ఎలిమెంట్‌కు భావోద్వేగాన్ని జోడించారు.
సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా సినిమా మంచి స్థాయిలో కనిపిస్తుంది. కెమెరా పనితనం, లొకేషన్స్, విజువల్స్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల తీవ్రతను పెంచేలా ఉంది. పబ్ నేపథ్యంలో వచ్చే పాటలు, కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు కూడా కథకు, సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి.
తీర్పు
గ్లామర్, బోల్డ్ క్యారెక్టరైజేషన్స్‌తో ప్రారంభమైన ‘ది రెడ్ బ్యాగ్’ చివరకు నలుగురు అమ్మాయిల పోరాటం, ప్రతీకారం, ఎమోషన్‌తో కూడిన కథగా మారుతుంది. సమాజానికి ఉపయోగపడే లక్ష్యంతో ‘రాబిన్ హుడ్’ తరహా ఆలోచనను టచ్ చేస్తూ తెరకెక్కించిన ఈ రివేంజ్ డ్రామా యాక్షన్, ఎమోషన్, గ్లామర్ అంశాలను కోరుకునే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్: 3/5







