Amaravathi lo Alajadi: రాజధాని నిర్మాణంలో మరో ట్విస్ట్- భూ సేకరణకు ప్రభుత్వం సిద్ధం

అమరావతిలో అలజడి మొదలైంది. రాజధాని నిర్మాణంలో మరో ట్విస్ట్ ఎదురైంది. భూ సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు భారీగా మోహరించారు. కొంతమంది రైతులు పూలింగ్లో భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణానికి వేలాదిమంది రైతులు భూములు ఇచ్చారు. కానీ, కొంతమంది రైతులు మాత్రం తొలి విడత భూ సమీకరణలో భూములు ఇవ్వలేదు. వీరు తాము భూములు ఇవ్వమని భీష్మించారు. దీనివల్ల రహదారుల వంకర టింకరగా నిర్మించాల్సి వచ్చింది. ఇది రాజధాని స్వరూపాన్ని దెబ్బతీస్తుందనే భావన ఉంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పర్యటించినప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చింది.

దీంతో ప్రభుత్వం 2013 నాటి కేంద్ర చట్టం మేరకు భూ సేకరణకు సిద్ధమైంది. రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల మధ్య సుమారు 700 ఎకరాల భూమి కావాలి. ఇవ్వాల్సిందిగా అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చారు. రైతులు పట్టించుకోలేదు. వైసీపీ మద్దతుతో వారు న్యాయపోరాటానికి దిగారు. హైకోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాజాగా కేబినెట్ సమావేశంలో భూ సేకరణకు పచ్చజెండా ఊపారు.శనివారం ఉదయమే సీడ్ యాక్సిస్ రోడ్డు పరిధిలో భూములను సీఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఉద్రిక్తతలు రాకుండా పోలీసులను భారీగా మోహరించారు.నష్టపరిహారం ఇవ్వకుండా పంటను ధ్వంసం చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందారు. అడ్డుకున్న రైతులను అరెస్టు చేశారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Share your love