నాగర్కర్నూల్: నీట్ పేపర్ లీక్ ఘటనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, యువత, విద్యావేత్తలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంతగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతోనే పరిస్థితి చేయి దాటిపోయిందని వివరించారు.
NEET Paper Leak Failures
వాంగ్చుక్ దీక్ష, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల విషయంలో కేంద్రం చూపించిన విధానం అస్సలు సరైంది కాదని ఆయన అన్నారు. విద్యార్థుల మీద అమానుషంగా ప్రవర్తించడం ప్రతి ఇండియన్ ను కలిచివేసిందని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజాగ్రహం తెలుసుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం తప్పనిసరైందని స్పష్టం చేశారు.
రైతులు చనిపోయిన తర్వాత సాగు చట్టాలు రద్దు చేసినట్లే, ఎందరో విద్యార్థులు నష్టపోయిన తర్వాత ధర్మేంద్రతో రాజీనామా చేయించారని మర్రి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నీట్ లాంటి జాతీయ పరీక్షల్లో ఇప్పటికైనా కేంద్రం మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
చివరగా, ఈ పరీక్షల విషయంలో ఫెయిల్ అయిన రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు దీన్ని గుర్తు పెట్టుకుంటారని ఆయన హెచ్చరించారు.





