Chandrababu Naidu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం ఎందుకు అవసరమన్నారు చంద్రబాబు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అమరావతిలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు. పోలీసు విధుల్లో ధైర్యం ఎంత అవసరమో, మానవత్వం కూడా అంతే అవసరమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Chandrababu Naidu calls humane policing

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తి తన సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తారని, కొందరు భయంతో మరికొందరు కన్నీళ్లతో ఆశ్రయిస్తారని చంద్రబాబు గుర్తుచేశారు. వారి సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని, యూనిఫాం బాధితులకు అభయమివ్వాలని సూచించారు. దుర్గగుడి శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాల నిర్వహణలో పోలీసుల పాత్ర కీలకమని ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో మంచి ట్రాక్ రికార్డు ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇటీవల ఏపీ కంట్రోల్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ రక్షణకు భంగం కలిగించే కుట్రలను ఛేదించిందని పేర్కొన్నారు. భద్రతపై నమ్మకం ఉన్న ప్రాంతాలకే పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

కాలానుగుణంగా నేరాలు చేసే విధానాలు మారుతున్నందున పోలీసులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నేరస్థులకు ఖాకీని చూస్తే భయం కలగాలని, బాధితులకు పోలీసులపై నమ్మకం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో సాంకేతికతను జోడించి మరింత మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు.

మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి

Leave a Comment