గ్రేటర్ హైదరాబాద్ పౌరులపై మరో పన్నుల పిడుగు పడనుంది. త్వరలో ‘వార్షిక అద్దె విలువ’ స్థానంలో ‘క్యాపిటల్ వ్యాల్యూ’ ఆధారంగా ఆస్తి పన్నును లెక్కించనున్నారు. ఈ నయా చట్టంతో గ్రేటర్ లో 19.49 లక్షల మంది ఆస్తిపన్ను యజమానులపై రెండింతల భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే భూముల ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు ఇది మరో దెబ్బగా మారనుంది.
ప్రస్తుతం నివాస, వాణిజ్య సముదాయాలకు విస్తీర్ణం, ప్రాంతం బట్టి వచ్చే అద్దె ఆధారంగా నామమాత్రంగా పన్నులు విధిస్తున్నారు. కొత్త విధానంలో ఆయా ప్రాంతాల భూమి విలువ లేదా మార్కెట్ రేట్ల ఆధారంగా పన్ను నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఐటీ కారిడార్, ప్రధాన కూడళ్లలో సాధారణ ఇంటి మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది. దీంతో ఏటా కట్టే ఆస్తిపన్ను ప్రస్తుతం కంటే 3-4 రెట్లు పెరిగే ప్రమాదం ఉంది. సొంత ఇల్లు ఉన్నవారు, అద్దెకు ఉండేవారు కూడా ఈ భారాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడనుంది.
ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి నగరపాలక సంస్థలలో ఒకే రకమైన పన్ను విధానం అమలు చేయనుంది. ఈ మూడు కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ఇప్పటి వరకు ఉన్న గందరగోళానికి తెరదించాలని భావిస్తోంది. కానీ ఈ ముసుగులో మార్కెట్ వాల్యూ ఆధారంగా పన్ను విధించి ప్రజలపై భారం మోపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నిపుణులు ఈ చర్యను నిలువునా ముంచడంగా అభివర్ణించారు.
ఇప్పటికే ఆస్తి పన్ను రివిజన్ ముసుగులో యజమానులకు నోటీసులు జారీ అయ్యాయి. సేల్ డీడ్, లింకు డాక్యుమెంట్లు, పర్మిట్ కాపీ, లీజ్ డీడ్, పన్ను రసీదు వంటి వివరాలను మూడు రోజుల్లో అందజేయాలని అధికారులు ఆదేశించారు. సమయానికి సమర్పించకపోతే సెక్షన్ 176, 177 కింద శిక్షార్హులవుతారని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఆస్తి యజమానుల్లో కలవరం మొదలైంది.





