Chandrababu Naidu: సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్‌లోకి మారే అవకాశం

Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన వెసులుబాటు కల్పిస్తూ అధికారిక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం సీపీఎస్‌లో కొనసాగుతున్న అర్హులైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్‌లోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే నియామక నోటిఫికేషన్ జారీ అయి, ఆ తర్వాత ఉద్యోగంలో చేరి ప్రస్తుతం సిపిఎస్‌లో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్‌లోకి మారేందుకు చివరి అవకాశంగా ఆప్షన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Chandrababu Naidu Issues CPS Conversion

ప్రస్తుతం విధుల్లో ఉన్నవారితో పాటు పదవీ విరమణ చేసినవారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గతంలో తీసుకున్న నిర్ణయాల కొనసాగింపుగా ఈ మార్గదర్శకాలు వెలువడ్డాయి. వివిధ నియామక నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై సేవలు అందిస్తున్న సిబ్బందికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నోటిఫికేషన్ వచ్చిన వారికి ఈ అవకాశం వర్తించదని, కేవలం నిర్ణీత తేదీకి ముందే నోటిఫికేషన్ జారీ అయిన వారికే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31, 2026 లోగా ‘NIDHI’ పోర్టల్‌లోని ‘CPS-OPS Conversion’ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. దరఖాస్తుతో పాటు నియామక నోటిఫికేషన్, సెలక్షన్ లిస్ట్, అపాయింట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్ అనే నాలుగు ప్రాథమిక పత్రాలను అధికారులు ధ్రువీకరించి ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఆ తర్వాత డిడిఓ, కాంపిటెంట్ అథారిటీ పరిశీలించి తుది ఆమోదం తెలిపిన తర్వాతే ఒపిఎస్‌లోకి మార్పు పూర్తవుతుంది. ఒపిఎస్‌లోకి మారిన ఉద్యోగులకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 వర్తిస్తాయని, వారికి కొత్తగా జీపీఎఫ్ ఖాతా కేటాయిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సిపిఎస్‌లో ఇప్పటివరకు జమ చేసిన ఉద్యోగి వాటాను జీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తారని, ప్రభుత్వ వాటాను ప్రభుత్వ ఖాతాకే మళ్లిస్తారని తెలిపింది. ఒపిఎస్‌లోకి మారిన ఉద్యోగులు మరలా ఎట్టి పరిస్థితుల్లోనూ సిపిఎస్ విధానంలోకి తిరిగి వెళ్లడానికి అవకాశం ఉండదని అధికారులు సూచించారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత శాఖల అధికారులను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి:

మరిన్ని వార్తలకోసం..


Visited 1 times, 1 visit(s) today

Leave a Comment