Revanth Reddy: కొడంగల్‌లో రూ.9 వేల కోట్ల పనులకు శ్రీకారం.. పర్యటన షెడ్యూల్ ఇదే

Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెగా రైతు మేళా, పారిశ్రామిక ఎక్స్‌పోను ప్రారంభించడంతో పాటు రూ.9,053 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. నవంబర్ 7న ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో మెగా రైతు మేళా మరియు ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా రైతులు, మహిళలు, పారిశ్రామికవేత్తలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

Revanth Reddy Kodangal Development Works

ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా అధికారిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నెలకొన్న కరవు పరిస్థితులు, రైతు సమస్యలపై విస్తృతమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ బహిరంగ సభకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం, ఆదర్శ రైతులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టడం వంటివి ఈ పర్యటనలో కీలక అంశాలుగా ఉన్నాయి.

రెండో రోజు నవంబర్ 8న హకీంపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరగనుంది. హకీంపేటలో రూ.4 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలు, రూ.2.35 కోట్ల వ్యయంతో కూడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్ల జూనియర్ కళాశాల, రూ.3 కోట్ల పోలీస్ స్టేషన్, కొడంగల్‌లో రూ.3.80 కోట్ల పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయం, దుద్యాలలో రూ.3 కోట్ల పోలీస్ స్టేషన్, రూ.12 కోట్ల సమీకృత మండల కార్యాలయ భవనాల ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.

ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశంగా కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2కు శంకుస్థాపన చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వద్ద జాతీయ రహదారి 167ఎన్ వరకు ఈ రహదారి రానుంది. కోస్గిలో రూ.6 కోట్ల సైన్స్ మ్యూజియం, దౌల్తాబాద్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభాలు ఉన్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 రహదారులు, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ రెండో దశ, రూ.118 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్ వ్యవసాయ కళాశాల, ఆధునిక బస్టాండ్లు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, మందిరాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు జరుగనున్నాయి. నవంబర్ 9న కొడంగల్ నుంచి హకీంపేటకు చేరుకుని రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.

మరిన్ని వార్తలకోసం..


Visited 1 times, 1 visit(s) today

Leave a Comment