
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం అధికారికంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. దేశ ప్రధానిగా మరియు ముఖ్యమంత్రిగా పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన ప్రధాని మోదీ నాయకత్వ పటిమను, క్రమశిక్షణను, నిబద్ధతను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొనియాడారు.
Chandrababu Naidu Meets PM Modi
ఈ అత్యున్నత స్థాయి భేటీలో రాష్ట్రాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన పలు కీలక అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికను, గోదావరి – కావేరి నదుల అనుసంధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలకు సమృద్ధిగా నీరు అందే ప్రయోజనాలను వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో దేశవ్యాప్తంగా రహదారుల నెట్‌వర్క్, పవర్ గ్రిడ్ అభివృద్ధి చెందినట్లే, నదుల అనుసంధానంతో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల 53 శాతం లోటు వర్షపాతం నమోదై వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రధానికి సీఎం వివరించారు. కరువు నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, కేంద్ర సహకారంతో మదనపల్లె కేంద్రంగా ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలను తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. అలాగే రాజధాని అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, విశాఖ మెట్రో మంజూరు, బీచ్ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర సహకారాన్ని అందించాలని అభ్యర్థించారు.
రాబోయే 2027లో రాష్ట్రంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో, చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరారు. దేశవిదేశాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిధులు ఎంతో అవసరమని తెలిపారు. 2047 నాటికి అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర – 2047 విజన్ లక్ష్యాలను ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు, కీలక ప్రాజెక్టుల త్వరితగతిన పూర్తికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సహాయం లభిస్తుందనే ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి






