
ప్రజలను విభజించే అలవాటు కాంగ్రెస్ పార్టీదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరి ఎప్పుడూ ద్వంద్వ ప్రమాణాలతో కూడుకుని ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని ప్రశంసించడం, ఓటమి పాలైనప్పుడు అదే సంస్థలపై నిందలు మోపడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అస్థిరపరిచేలా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ అపరిపక్వతను స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
భారతదేశంలో 1975 సంవత్సరంలో అత్యవసర పరిస్థితిని విధించి, పత్రికా స్వేచ్ఛను కాలరాసి, మానవ హక్కులను హరించి, ప్రతిపక్ష నేతలను జైళ్లలో మగ్గేలా చేసిన కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎన్నికల సంఘం పనితీరును అప్పట్లో ఆ పార్టీ నేతలే పూర్తిగా సమర్థించారని తెలిపారు. కేరళలో ఓటర్ల జాబితా ప్రక్షాళన సమయంలో నకిలీ ఓట్ల తొలగింపు తమ విజయానికి దోహదపడిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడే స్వయంగా ప్రశంసించారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడం విస్మరించి, కేరళకు వెళ్లి సోనియా గాంధీ కుటుంబం కోసం త్యాగం చేయడానికి సిద్ధమని ప్రకటించడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశ భద్రతా వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, లోక్‌సభ స్పీకర్, సీజేఐ, ఈడీ, సీబీఐ, ఐబీలతో పాటు మీడియా సంస్థలను సైతం రాహుల్ గాంధీ టార్గెట్ చేశారని, పార్లమెంట్ వ్యవస్థపై కూడా అపనమ్మకాన్ని సృష్టించారని ఆయన మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై గత పన్నెండు సంవత్సరాలలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడమే కూటమి విజయాలకు అసలు ప్రాతిపదిక అని కిషన్ రెడ్డి వివరించారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి అధికారానికి దూరంగా ఉండటంపై ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని విధంగా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆర్థిక దివాాలా తీయించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.






