Kalvakuntla Kavitha: ఇంటర్ బోర్డు రద్దు వెనుక కుట్ర ఉందని కవిత ఆరోపణలు.. ఏమన్నారంటే

Kalvakuntla Kavitha

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం రోజున సోమాజిగూడలోని ఒక హోటల్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా మండలిని రద్దు చేయాలన్న ప్రభుత్వం ఆలోచన వెనుక స్థానికత అంశంలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే కుటిల యత్నం దాగుందని ఆమె స్పష్టం చేశారు. విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా సాగుతున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె హెచ్చరించారు.

Kalvakuntla Kavitha Opposes Inter Board

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐసీయూలో ఉన్న విద్యా వ్యవస్థ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోకి వచ్చాక మరింత ప్రమాదకరమైన వెంటిలేటర్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందని కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో ఇంటర్ బోర్డును విలీనం చేయాలనేది విఫల ప్రయోగమని ఆంధ్రప్రదేశ్ అనుభవాల ద్వారా స్పష్టమైనప్పటికీ, ఇక్కడ మళ్లీ అదే విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏ రకమైన ప్రూవ్డ్ ఎవిడెన్స్ లేకుండా, అఖిలపక్షం, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు లేదా వారి తల్లితండ్రులతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని నిలదీశారు.

తన గురువు చంద్రబాబు మెప్పుకోసం ఆంధ్రా ప్రజలకు మేలు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డును రద్దు చేసి, తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఆంధ్రా విద్యాసంస్థలకు అనుమతినిచ్చే పనిలో ఉన్నారని కవిత ఆరోపించారు. దీనివల్ల అమలాపురంలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు హైదరాబాద్‌లో పరీక్షలు రాసి లోకల్‌గా చెలామణి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపక్వత లేని చిన్న పిల్లల మాదిరిగా విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఐఏఎస్ అధికారులతో సఖ్యత లేని భయంకరమైన పాలన రాష్ట్రంలో సాగుతోందని కవిత విమర్శించారు. గతేడాదే ఇంటర్ బోర్డు రద్దు ప్రకటన తర్వాత అడ్మిషన్లు కూడా మొదలయ్యాక మళ్లీ బోర్డును రద్దు చేస్తామని ప్రకటించడం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకుని, ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

మరిన్ని వార్తలకోసం..


చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: భారతదేశాన్ని ఆశించిన డచ్ వారు ఎవరు?

Visited 1 times, 1 visit(s) today