Miyapur Killing: మియాపూర్ భర్త హత్య కేసు – దృశ్యం స్ఫూర్తితో మృతదేహం తగలబెట్టిన భార్య ప్రియుడు

మియాపూర్‌లో భర్త హత్య కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు

మియాపూర్‌లో భర్త హత్య కేసు విస్తృతంగా దర్యాప్తు చేయగా, కేసు వివరాలు సంచలనంగా మారాయి. భార్య సత్యవతి తన ప్రియుడితో కలిసి భర్త పెంటేశ్‌ను హత్య చేసి, దృశ్యం సినిమా స్ఫూర్తితో మృతదేహాన్ని తగలబెట్టింది. ఈ హత్య కేసు ఇప్పుడు హైదరాబాద్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

మియాపూర్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మల్లాని పెంటేష్ (57) మరియు సత్యవతి (47) దంపతులు. సత్యవతికి అదే అపార్ట్మెంట్‌లో నివసించే మర్రి మధుసూదన్‌రెడ్డితో అక్రమ సంబంధం ఉండేది. దీన్ని తెలుసుకున్న పెంటేశ్ భార్యను నిలదీయడంతో, భర్తను తొలగించేందుకు సత్యవతి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈ విషయంలో వారు దృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారు.

నవంబరు 19 రాత్రి సత్యవతి, ప్రియుడు మధుసూదన్ మరియు స్నేహితుడు రాజేశ్ కుమార్ కలిసి భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెంటేశ్‌కు ఇచ్చారు. అతను స్పృహ కోల్పోయాక, ముగ్గురు కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని వాహనంలో తరలించి, నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోలు పోసి తగలబెట్టారు. హత్య తర్వాత నవంబరు 25న పెంటేశ్ అదృశ్యమయ్యాడంటూ సత్యవతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే సత్యవతి ప్రవర్తనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో, పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో సాంకేతిక విచారణలో నిందితుల బండారం బయటపడింది. పోలీసులు సత్యవతి, మధుసూదన్‌రెడ్డి మరియు రాజేశ్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ మియాపూర్‌లో భర్త హత్య కేసు సినిమా తరహాలో ఉన్నా, పోలీసుల దర్యాప్తు ముందు నిలబడలేకపోయింది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu