
వైద్య శాస్త్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ పురస్కారం 2026 సంవత్సరానికి గాను ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను సంయుక్తంగా వరించింది. కాంతి నాడీ కణాలను అలాగే మెదడు సర్క్యూట్‌లను ఏ విధంగా నియంత్రించగలదో స్పష్టంగా నిరూపించినందుకు కార్ల్ డీసెరోత్, పీటర్ హెగెమాన్, జార్జ్ నాగేల్ ఈ బహుమతికి ఎంపికయ్యారు. ఈ మేరకు నోబెల్ అసెంబ్లీ ఈ ప్రకటన వెలువరించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య రంగానికి, నాడీ శాస్త్ర పరిశోధనలకు అత్యంత కీలకమైన పునాదిగా నిలిచాయి.
Nobel Medicine Trio Win 2026
నాడీ శాస్త్ర రంగంలో ఆప్టోజెనెటిక్స్ విధానం ఒక సరికొత్త శకానికి నాంది పలికిందని నోబెల్ అసెంబ్లీ తన ప్రకటనలో అభివర్ణించింది. మెదడు ఎలా పనిచేస్తుందో మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి, ప్రవర్తనకు మరియు వివిధ వ్యాధులకు దారితీసే మార్గాలను పరిశోధించడానికి కాంతితో నియంత్రించే ఒక ప్రత్యేక స్విచ్‌ను కనుగొనడం ఈ ప్రయోగం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. ఒక ప్రత్యేకమైన ఏకకణ ఆకుపచ్చ శైవలం కాంతి వైపు ఎలా ఈదగలదో పీటర్ హెగెమాన్ అన్వేషించడంతో ఈ చారిత్రాత్మక పరిశోధనకు అంకురార్పణ జరిగింది. ఆయనతో కలిసి జార్జ్ నాగేల్ దీనికోసం ఒక విశిష్టమైన ప్రోటీన్‌ను గుర్తించారు.
ఈ విశిష్ట ప్రోటీన్‌ను నీలి కాంతితో ప్రకాశింపజేసినప్పుడు విద్యుత్ ప్రేరణను సృష్టించడానికి ఒక నూతన మార్గం తెరుచుకుంటుంది. ఆ ప్రోటీన్‌ను ఇతర కణాలలో ప్రవేశపెట్టడం ద్వారా అవి కాంతికి అత్యంత సున్నితంగా మారేలా చేయవచ్చు. ఆ తర్వాత కార్ల్ డీసెరోత్ జీవించి ఉన్న ఎలుకల మెదడులోని నాడీ కణాల కోసం కాంతితో నియంత్రించబడే ఒక స్విచ్‌ను సృష్టించడానికి ఆ ప్రోటీన్‌ను నియంత్రించే జన్యువుతో విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించారు. మెదడులోని వ్యక్తిగత నాడీ కణాల కార్యకలాపాలను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగపడే ఈ యంత్రంగానికి సంబంధించిన పరిశోధనలే వీరిని ఈ పురస్కారానికి అర్హులుగా నిలబెట్టాయి.
ప్రస్తుతం కార్ల్ డీసెరోత్ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో సేవలందిస్తుండగా, పీటర్ హెగెమాన్ బెర్లిన్‌లోని హంబోల్ట్ విశ్వవిద్యాలయంలో మరియు జార్జ్ నాగేల్ జర్మనీలోని వుర్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కాంతి-నియంత్రిత అయాన్ ఛానెళ్లు మరియు ఆప్టోజెనెటిక్స్‌పై వీరు చేసిన ఈ విశేషకృషి భవిష్యత్తులో మానవ మెదడుకు సంబంధించిన క్లిష్టమైన వ్యాధుల నివారణకు ఎంతో ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పురస్కారం ద్వారా నాడీ శాస్త్రంలో సరికొత్త ప్రయోగానికి మరింత ఊతం లభించినట్టయింది.
మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి






