జాస్మిన్ భాసిన్ ఆరోగ్యం ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. Terminal Ileitis అనే వ్యాధితో బాధపడుతున్న ఆమెను దుబాయ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. తన 36వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లిన ఆమెకు అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ అలీ గోనీ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జాస్మిన్ మాట్లాడుతూ, నాకు ఫ్లై చేయడానికి మెడికల్ క్లియరెన్స్ రాలేదు. ఇంకా డేంజర్ జోన్ నుండి బయటపడలేదు. కొన్ని ఇంజెక్షన్లతో నన్ను స్థిరపరిచారు. ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. దిగిన వెంటనే మరొక ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ కొనసాగిస్తా అని చెప్పారు. డాక్టర్లు దీన్ని చిన్న ప్రేగు మంటగా నిర్ధారించారు.
Terminal Ileitis అనేది చిన్న ప్రేగు చివరి భాగంలో వాపు. ఇది ప్రత్యేక వ్యాధి కాదని, క్రోన్స్ డిసీజ్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, TB లేదా NSAID వంటి మందుల వల్ల వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. సాధారణ లక్షణాలలో కుడి దిగువ పొత్తికడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం, వికారం, బరువు తగ్గడం ఉంటాయి. రెండు వారాల కంటే ఎక్కువ ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చికిత్స పూర్తిగా కారణంపై ఆధారపడి ఉంటుంది. రక్త పరీక్షలు, కొలొనోస్కోపీ, బయాప్సీ ద్వారా కారణం కనుగొంటారు. ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్, క్రోన్స్ అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదా బయోలాజిక్ థెరపీలు ఇస్తారు. ధూమపానం నివారించడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, నీటి పరిశుభ్రత పాటించడం వల్ల Terminal Ileitis ని కొంతవరకు నివారించవచ్చు. డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి మెడికేషన్ తీసుకోకూడదు.





