తెలంగాణలో నీటి నిల్వలు తీవ్ర కనిష్ఠానికి చేరుకున్నాయి. జల సంక్షోభం మరింత ముమ్మరమవుతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో సాధారణం కంటే ఏకంగా 32 శాతం తక్కువ నీళ్లు ఉన్నాయి. దేశంలో అత్యంత తక్కువ నీటి నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. ఈ ఏడాది వర్షాలు బాగా తగ్గిపోవడంతో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు పదేండ్ల కనిష్ఠానికి పడిపోయాయి. 166 జలాశయాల మొత్తం సామర్థ్యం 9103.34 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్నది కేవలం 2098.93 టీఎంసీలు మాత్రమే.
Water crisis in Telangana
తెలంగాణలోని 8 ప్రధాన రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉండాల్సిన నీటి నిల్వలు 19.26 శాతం కాగా, నిజానికి 12.92 శాతం మాత్రమే ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిరుడు ఇదే సమయంలో 30.18 శాతం నీరు ఉండగా, ఈ ఏడాది అది సగానికి పడిపోయింది. పొరుగున ఉన్న ఏపీలో మాత్రం సాధారణం కంటే 21 శాతం ఎక్కువ నీటి నిల్వలు ఉండటం గమనార్హం. కృష్ణా జలాలను తరలించుకున్న ఏపీకి ప్రస్తుతం నీటి కొరత లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద కీలకమైన మిడ్మానేరు రిజర్వాయర్లో ఇప్పుడు కేవలం 7.4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీని మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలు. నిరుడు ఇదే డ్యామ్ సముద్రంలా కనిపించింది. కానీ ఇప్పుడు డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకుంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తేనే ఇక్కడి నుంచి హైదరాబాద్, నల్లగొండ దాకా నీరు చేరే పరిస్థితి.
దేశవ్యాప్తంగా చూస్తే, ఉత్తరాదిలో 11 జలాశయాల్లో సాధారణం కంటే తక్కువ నీరు ఉంది. తూర్పు, పశ్చిమ, మధ్య భారతంలో కూడా నీటి నిల్వలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తిగా దారుణంగా ఉంది. ప్రభుత్వం వెంటనే అవగాహన పెంచుకుని, నీటి నిర్వహణపై దృష్టి పెట్టకపోతే, రాబోయే నెలల్లో తాగు నీటికి కూడా కొరత వచ్చే అవకాశం ఉంది.





