Revanth Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీలో ఉండడని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. పూర్తి వివరాలు ఇవే?

Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, అలాగే ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉండబోరని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 2004 ఎన్నికల సమయంలో హరీష్ రావు వార్డు మెంబర్ స్థాయి నాయకుడు కూడా కాదని, అప్పట్లో వైయస్ రాజశేఖర రెడ్డి తన మొదటి కేబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.

Revanth Reddy Siddipet Harish Rao

సిద్దిపేట గడ్డపై గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన అనంతుల మదన్ మోహన్ సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. 1983లో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేసిన ఘనత మదన్ మోహన్ దక్కించుకున్నారని, అయితే వారి పేరును చరిత్ర పుటల నుంచి చెరిపివేయాలని కేసీఆర్, హరీష్ రావు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహను సీఎం అధికారికంగా ఆదేశించారు.

ఇదే సభలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల విలువైన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరితే ఇక్కడికి మంత్రి పదవి ఇస్తామని, ప్రజలు కోరిన నాయకుడికే టికెట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే గెలిపించుకునే బాధ్యత పూర్తిగా స్థానిక ప్రజలదేనని స్పష్టం చేస్తూ, 2029లో రెండోసారి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాజకీయంగా విమర్శలు చేసే ప్రతిపక్ష నేతల తీరును తప్పుపడుతూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సిద్దిపేట కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ కార్యక్రమాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

మరిన్ని వార్తలకోసం..



చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: భారతదేశాన్ని ఆశించిన డచ్ వారు ఎవరు?

Visited 1 times, 1 visit(s) today