BRS RTC: ఆర్టీసీ ఎన్నికలకు BRS పార్టీ దూరంగా ఉండటానికి అసలు కారణాలు ఏమిటి?

BRS RTC

భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలలో ఈ పార్టీ పోటీ చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు గౌరవాధ్యక్షుడిగా గుర్తింపు సంఘం ఎన్నికలను ఎంతో సీరియస్‌గా తీసుకొని పనిచేసేవారు. అయితే ఈసారి మాత్రం కార్మిక సంఘాల నుంచి తీవ్ర వత్తిడి వచ్చినప్పటికీ, పార్టీ పెద్దలు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కనీసం పోటీలో ఉన్న ఏ యూనియన్‌కు కూడా బహిరంగ మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం.

BRS RTC party stays away

గతంలో ఈ గుర్తింపు సంఘం ఎన్నికలలో ప్రత్యర్థులుగా పోటీ పడిన ఎంప్లాయీస్ యూనియన్ (EU), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU), నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) ఈసారి కూటమిగా ఏర్పడ్డాయి. అప్పట్లో EU, TMUలలో కీలక పాత్ర పోషించిన నేతలే తెలంగాణ వర్కర్స్ యూనియన్ (SWF) రూపంలో బరిలోకి దిగుతున్నారు. ఈ SWFకి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు సీఐటీయూ అనుబంధ సంఘం మద్దతు తెలపడంతో ఆర్టీసీ ఎన్నికలు అకస్మాత్తుగా తీవ్ర రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీలో యూనియన్లను పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో, తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ గుర్తింపు సంఘం ఎన్నికలు రావడం గులాబీ పార్టీని తీవ్ర డైలమాలో పడేసింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని అప్పట్లో కేసీఆర్ ప్రకటించి ఇక యూనియన్ల అవసరం లేదని స్పష్టం చేయడంతో, టీజీఎస్‌ ఆర్టీసీ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి కార్మిక సంఘాలు లేకుండానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ కార్మిక విభాగం నేతలు ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేద్దామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ గతంలో తమ అధినేతే ఈ ఎన్నికలు, యూనియన్లు వద్దని స్వయంగా ప్రకటించడం, ఆర్టీసీ ఇప్పటివరకు ప్రభుత్వంలో పూర్తిగా విలీనం కాకపోవడం వంటి అంశాలు వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలు భావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ యూనియన్లను ఏర్పాటు చేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుపుతుండడంతో పోటీ చేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందని కార్మిక నేతలకు అధిష్టానం సర్దిచెప్పింది.

ప్రస్తుతానికైతే ఈ గుర్తింపు సంఘం ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండాలని తెలంగాణ భవన్ నుంచి కార్మిక నేతలకు స్పష్టమైన సూచనలు వెలువడ్డాయి. అయితే బహిరంగంగా బీఆర్ఎస్ ఏ సంఘానికి మద్దతు ప్రకటించనప్పటికీ, లోపాయికారీగా బీఆర్ఎస్‌కు సానుభూతి పరులుగా ఉండే ఆర్టీసీ ఓటర్లంతా అధికార పార్టీ గుర్తింపు సంఘానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఇంటర్నల్‌గా చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, భవిష్యత్తులో కార్మిక సంఘాల రాజకీయాలపై తగిన విధంగా ఆలోచిస్తామని గులాబీ కార్మిక విభాగం నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.

మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_