వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రమవుతోంది. నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నా, కార్మిక యూనియన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో షూటింగ్స్ సాధ్యం కావడం లేదు. సీరియల్స్ షూటింగ్స్ కూడా సినీ కార్మిక యూనియన్స్ అడ్డుకుంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలతో ప్రొడ్యూసర్స్ సంప్రదింపులు చేస్తున్నారు.
ఈ రోజు ఫిలింఛాంబర్ లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల తర్వాత ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో సినీ కార్మిక సంఘాల నాయకులు భేటీ కానున్నారు. నిర్మాతల్లాగే తామూ వెళ్లి చిరంజీవిని కలిసి తమ సమస్యను చెబుతామని కార్మిక సంఘాలు అంటున్నాయి. మెగాస్టార్ చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, నిర్మాతలు పెట్టిన నిబంధనలపై చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు. ఈ రోజుకైనా ఈ సమస్య కొలిక్కి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.





