General Elections: భారతదేశంలో తొలి సాధారణ ఎన్నికలు 1952 నాటి చరిత్ర ఆసక్తికర విశేషాలు

General Elections

ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్రలో మన దేశంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలను ఒక అసాధారణమైన చారిత్రక ఘట్టంగా భావిస్తారు. దేశ జనాభాలో సుమారు ఆరో వంతు మంది ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ ఎన్నికలు అప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ, సంక్లిష్టమైన ప్రజాస్వామ్య ప్రక్రియగా రికార్డు సృష్టించాయి. నెహ్రూ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరియు రాజ్యాంగ నిర్మాతలు కుల, మత, జాతి, లింగ, అక్షరాస్యత, ఆస్తి విచక్షణ లేకుండా వయోజనులందరికీ సార్వత్రిక ఓటు హక్కును కల్పించారు. తద్వారా ప్రపంచ దేశాలకు, ప్రత్యేకించి అప్పుడే స్వాతంత్య్రం పొందుతున్న ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని నూతన దేశాలకు ఒక ఆదర్శవంతమైన నమూనాను అందించారు.

General Elections History First India

భారతదేశ మొదటి సార్వత్రిక ఎన్నికల అపూర్వ విజయం వెనుక ఏళ్ల తరబడి జరిగిన మేధోమథనం మరియు అత్యంత పటిష్టమైన రాజ్యాంగ, చట్టపరమైన పునాది ఉన్నాయి. 1949 నవంబర్ 26న ఆమోదం పొంది 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను బలంగా ప్రతిష్టించింది. ఈ రాజ్యాంగం ద్వారానే వయోజన ఓటుహక్కు సాకారమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఉనికిలోకి వచ్చింది. అందుకే జనవరి 25ను ప్రతి యేటా ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించే బృహత్తర బాధ్యతను ఈ సంస్థకు అప్పగించింది రాజ్యాంగం. పశ్చిమ బెంగాల్ మాజీ చీఫ్ సెక్రటరీ సుకుమార్ సేన్ భారతదేశపు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

దేశ భౌగోళిక వైవిధ్యం, రవాణా సౌకర్యాల లేమి, మౌలిక వసతుల కొరత, దేశ విభజన కారణంగా ఏర్పడిన లక్షలాది మంది శరణార్థుల సమస్య తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను జటిలం చేశాయి. సుకుమార్ సేన్ పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి దేశంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏ రకమైన పూర్వానుభవం గానీ, సంస్థాగత జ్ఞానం గానీ లేదు. పైగా బ్రిటిష్ ఇండియాలోని 17 ప్రావిన్సులు 565 స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా దేశ పునర్నిర్మాణం జరుగుతున్న రోజులవి. ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు అనుగుణంగానే నియోజకవర్గ సరిహద్దులను నిర్ణయించడం కత్తిమీద సామనే చెప్పాలి. అప్పటి దేశ జనాభా సుమారు 36 కోట్లు కాగా, అందులో 21 ఏళ్లు పైబడిన వారు 17.32 కోట్లు ఉన్నారు.

వీరందరినీ ఓటర్లుగా నమోదు చేయడానికి దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వేలు నిర్వహించారు. మొత్తం 489 లోక్‌సభ స్థానాలతో పాటు 18 రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన 3283 స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ మహాక్రతువును నిర్వహించడానికి సుకుమార్ సేన్ సుమారు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో 56వేల మంది ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఓటర్ల జాబితాలను టైప్ చేసి క్రోడీకరించడానికి ఒప్పంద ప్రాతిపదికన 16500 మంది గుమస్తాలను నియమించారు. దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియను అత్యంత విజయవంతంగా ముగించి ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకున్నారు.

మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_