Kaleshwaram Challenge: జగదీష్ రెడ్డి సవాల్ – ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే చర్చకు సిద్ధమా?

Jagadish Reddy challenges

హైదరాబాద్ లో BRS నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పై CM రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లను ఘాటుగా ఎదుర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు పై అవగాహన లేకుండా వారు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేస్తే రాష్ట్రాన్ని కరువు నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. ప్రాజెక్టులు, రైతుల పై చిత్తశుద్ధి ఉంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

గంధమళ్ళ, బస్వాపూర్ నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అప్పర్ మానేర్, మిడ్ మానేర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, సుందిళ్ల, ఎస్సారెస్పీ, అన్నారం బ్యారేజీ నీళ్లు మొత్తం తీసుకెళ్లిన గోదావరిలో ఒక్క చోట పోసినా భద్రాచలానికి ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు. నీటిని స్టోరేజీ చేస్తే భద్రాచలం మునిగిపోతుందనే CM, మంత్రి వాదనలను తిప్పికొట్టారు. ఇప్పటికైనా వారు జ్ఞానం తెచ్చుకుని కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

సూపర్ ఎల్ నినో ప్రభావంతో రానున్న రెండు ఏళ్ల వరకు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని జగదీష్ రెడ్డి అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేయమని సలహా ఇస్తే వారిని జైలులో వేస్తానని మంత్రి అనడం శోచనీయంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి షాబాద్ ఘటనే నిదర్శనం అని ఆయన అన్నారు. గత BRS ప్రభుత్వంలో ఇలాంటి సీరియల్ క్రైమ్స్ కనిపించలేదని తెలిపారు.

నేరం చేయాలంటేనే వణుకు పుట్టేలా BRS ప్రభుత్వం పనిచేసిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూ ఆక్రమణల మీదే శ్రద్ధ పెడుతూ మిగిలిన విషయాలను పట్టించుకోవడం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై చిత్తశుద్ధి ఉంటే వారు చర్చకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu