
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్–3’ పథకానికి ఆమోదం తెలిపింది. సులభంగా చెప్పాలంటే, సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు, అక్కడి నుంచి వినియోగదారులకు చేర్చేందుకు అవసరమైన హై-వోల్టేజ్ లైన్లు, సబ్‌స్టేషన్లను రాష్ట్రాల్లో నిర్మించే పథకం ఇది. ఈ పథకానికి మొత్తం రూ.1,86,405 కోట్లు వ్యయం కానుంది.
సౌర, పవన విద్యుత్ గ్రిడ్‌కు చేరే విధానం
పథకం కింద రూ.1,36,378 కోట్లతో రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ ప్రసార వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. రూ.50,000 కోట్లతో 50 గిగావాట్ అవర్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. మొత్తం కేంద్ర ఆర్థిక సహాయం రూ.54,082 కోట్లు. ఈ సహాయం ప్రసార చార్జీలను భర్తీ చేసి విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.
ఈ పథకం ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు తరలించవచ్చు. కొత్త ప్రాజెక్టులను పోటీ బిడ్డింగ్ పద్ధతిలో అమలు చేస్తారు; ఇప్పటికే ఉన్న వ్యవస్థల ఆధునికీకరణ పనులను వ్యయ ఆధారిత విధానంలో చేపడతారు. 2032–33 ఆర్థిక సంవత్సరం నాటికి పథకాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం.
విద్యుత్ రంగం, తయారీ, నిర్మాణ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం సాధించాలన్న దేశ లక్ష్యానికి, దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఈ పథకం తోడ్పడుతుందని ప్రభుత్వం తెలిపింది.
మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి






