తమిళనాడులో ప్రాజెక్ట్ మేఘాలయ పేరుతో విజయ్ సర్కార్‌ను కూల్చే కుట్రపై దర్యాప్తు వేడెక్కింది. టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కొందరు కుట్ర పన్నారన్న షాకింగ్ ఆరోపణలు వస్తున్నాయి. చెన్నై పోలీసులు ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, విచారణ ముమ్మరం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్ సర్కార్‌ను కూల్చే కుట్రపై దర్యాప్తు వేడి
ఊతంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్.ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. IPDS అనే ఓపీనియన్ పోలింగ్ సంస్థ నడిపే యూట్యూబర్ తిరునావుక్కరసు తనకు రూ.35 కోట్ల offer చేశాడని ఆయన ఆరోపించారు. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటు వేయాలని, అలా చేస్తే కుటుంబాన్ని బెదిరిస్తామని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ మేఘాలయ పేరుతో దాదాపు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను కలిసే ప్లాన్ చేశారట.
ఈ కేసు దర్యాప్తు విస్తరిస్తుండగా, పోలీసులు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ సీనియర్ జర్నలిస్ట్‌ను కూడా విచారించారు. జులై 15, 16 తేదీల్లో ఆయన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తిరునావుక్కరసుతో సంప్రదింపులకు ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. కానీ ప్రెస్ క్లబ్ ఆఫ్ చెన్నై మాత్రం ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. పోలీసులేమో చట్టప్రకారమే విచారిస్తున్నామని స్పష్టం చేశారు.
రాజకీయంగా ఈ కేసు మరింత వేడెక్కింది. మాజీ మంత్రి, డీఎంకే నేత బాలాజీ మరియు ఆయన సోదరుడు అశోక్‌కు కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే డీఎంకే మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించింది. రాజకీయ లాభం కోసం టీవీకే తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ వాదిస్తోంది. ప్రాజెక్ట్ మేఘాలయ కేసులో ఇంకా ఎన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.





