ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దీపికా పదుకోనే హీరోయిన్గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’లో బ్లాస్ట్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ ఛాన్స్ మిస్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అట్లీ ఓ ఈవెంట్లో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ‘ఇదయం మురళీ’ ప్రీ-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అట్లీ.. ప్రీతీ ముకుందన్ గురించి ఆసక్తికర విషయం పంచుకున్నారు. ‘రాకా’లో ఓ కీలక పాత్ర కోసం ప్రీతీని సంప్రదించామని, కానీ ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు సర్దుబాటు కాలేదని చెప్పారు. ఇప్పుడీ పాత్రను ఫెమినా జార్జ్ చేయనుంది, ఆమె ఏ రోల్‌లో కనిపిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రీతీ ముకుందన్ ఇటీవల ‘బ్లాస్ట్’ సినిమాతో మంచి ప్రేక్షకాదరణ పొందింది. అందంతో పాటు యాక్షన్ సీన్స్‌లో కూడా ఆకట్టుకుంది. అంతకంటే ముందు తెలుగు సినిమా ‘కన్నప్ప’లో కనిపించి తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. ప్రస్తుతం పలు భాషల్లో అవకాశాలు వస్తుండటంతో ఆమె చాలా బిజీగా ఉంది.
ఇక ‘రాకా’ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ కొత్తగా ఉండటం, భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ ఈ సినిమాకు అదనపు క్రేజ్ తీసుకొచ్చాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వివరాలను ప్రకటించడానికి అవకాశం ఉంది.





