
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన మూడు రోజుల కొడంగల్ పర్యటన ముగింపు సందర్భంగా లగచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి, పాలమూరు వలసలు మరియు నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పది జన్మలెత్తినా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తాను కాలేరని, రేవంత్ రెడ్డి కావడానికి గుండె ధైర్యం, నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Revanth Reddy mocks KTR strict
బూర్గుల రామకృష్ణారావు కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే కష్టాలు తీరుతాయని కేసీఆర్‌ను గెలిపిస్తే, ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయాడని ఆయన విమర్శించారు. పదేళ్ల పాటు పాలమూరు అభివృద్ధిని కక్షగట్టి అడ్డుకున్నారని, కేసీఆర్ పాలనలో రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేసిన అప్పులకు ఈ 34 నెలల్లో రూ. 2 లక్షల కోట్లకు పైగా వడ్డీలు కట్టామని ఆయన గుర్తుచేశారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులకు కడుపుమంటగా ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టిందని, బుద్ధి రావడానికి ఎన్ని ఏళ్లు పడుతుందోనని వ్యాఖ్యానించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పటికీ పులి కాదని, గడ్డం మోకాళ్ల వరకు పెంచుకున్నా కేటీఆర్ ఎప్పటికీ రేవంత్ రెడ్డి కాలేడని స్పష్టం చేశారు. ఉద్యోగుల కష్టాలు గుర్తించి 2024 జనవరి 1 నుంచి ప్రతి నెలా మొదటి తారీఖున 11 లక్షల మంది ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నామని ఆయన వెల్లడించారు.
మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_




