వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై రేపు స్పష్టత రానుంది. ఫిలింఛాంబర్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడికి సరైన రాబటి లేక తాము ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వేతనాలు పెంచడం సాధ్యంకాదంటూ నిర్మాతలు అంటున్నారు. ఇరు వర్గాలు పట్టుదలగా ఉండటంతో సమస్య జఠిలంగా మారింది.
నిన్నటి నుంచి అటు ప్రభుత్వాలతోనూ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు ఫిలింఛాంబర్ లో మీటింగ్ జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిర్మాతలు, సినీ కార్మిక సంఘాలతో కో ఆర్డినేషన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో వేతనాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సమ్మెను కొనసాగించాలని తమకు లేదని, చిన్న నిర్మాతల సినిమాలకు తక్కువ వేతనాలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు.





