TDP-JSP: ఏపీలో స్థానిక ఎన్నికలకు TDP-JSP కూటమి రెడీ

ఏపీలో స్థానిక ఎన్నికలకు TDP-JSP కూటమి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. పాలనలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఈ కూటమి, ఇంకో మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అంతకు ముందు రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య మైత్రి ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా TDP-JSP మధ్య సయోధ్య స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది.

టీడీపీ సీనియర్ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీల మధ్య పొత్తుకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి కూటమిలోని మూడు పార్టీల మధ్య ఎలాంటి ప్రాబ్లెం లేదని, భవిష్యత్తులోనూ పొరపొచ్చాలు వచ్చే ఛాన్స్ లేదని ఆయన చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి వల్ల లాభాలను ప్రత్యక్షంగా చూడబోతున్నామని చింతమనేని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు కాకుండా ఇతర పార్టీలు ప్రభావం చూపే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ, జనసేనల మధ్య అక్కడక్కడ విభేదాలు పొడచూపుతున్నాయన్న చింతమనేని స్పందిస్తూ, అన్నదమ్ముల మధ్యా విభేదాలు ఉండటం నార్మల్ అని చెప్పారు. ఈ విభేదాలను చర్చించుకుని అధిగమించే దిశగా సాగుతున్నామని ఆయన తెలిపారు.

చివరగా, స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి సీట్లను పంచుకుంటామని, అవకాశం లేని పక్షంలో స్నేహపూర్వకంగా పోటీ చేస్తామని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. దాదాపు అన్ని సీట్లు కూటమి పార్టీల మధ్యనే పంపిణీ అవుతాయని, మరో పార్టీకి అవకాశం లేకుండా చూసుకుంటామని ఆయన ఆసక్తికరంగా చెప్పారు. అంతిమంగా TDP-JSP కూటమి స్థానిక ఎన్నికల్లో బలంగా నిలవడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Share your love