Jagan 2.0: సూపర్ యాప్ తో వైసీపీకి కొత్త రాజకీయ వ్యూహం!!

రాజకీయ పార్టీలు ఇప్పుడు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీలో విపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఒక Super App ను ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం జరిగిన పార్లమెంటరీ మీటింగ్‌లో ఈ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్‌ను ‘జగన్ 2.0 సూపర్ యాప్’ అని పిలుస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో నిత్యం కనెక్ట్ అవ్వడం, కీలక నిర్ణయాలు వారితో షేర్ చేయడం ఈ యాప్ లక్ష్యం.

YCP Super App వల్ల ఉపయోగాలు

ఈ యాప్ వల్ల పార్టీ తన కార్యకర్తలతో నేరుగా టచ్‌లో ఉండగలదు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులు పోస్టులు ఎడిట్ చేసి ప్రచారం చేస్తుంటే, దాన్ని అడ్డుకోవడానికి ఈ యాప్ సహాయపడుతుందని జగన్ తెలిపారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చివరి స్థాయి కేడర్ దాకా ఖచ్చితంగా చేరవేయడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. దీంతో కార్యకర్తలకు తప్పుడు అవగాహన రాకుండా ఉంటుంది.

వైసీపీ ఇప్పటికే సోషల్ మీడియా విభాగాన్ని బాగా యాక్టివ్‌గా నడుపుతోంది. అలాగే అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారు. కానీ ప్రత్యర్థి పార్టీలు తరచుగా ఫేక్ పోస్టులు తయారు చేసి వైసీపీపై విమర్శలు చేస్తుంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సూపర్ యాప్ ఒక మంచి టూల్‌గా పనిచేస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

పార్టీ కేడర్‌పై ప్రభుత్వం నుంచి వేధింపులు జరిగితే వాటిని నమోదు చేయడానికి ఇప్పటికే వైసీపీ డిజిటల్ డైరీని ఏర్పాటు చేసింది. ఈ డైరీని ఇప్పుడు జగన్ 2.0 సూపర్ యాప్‌తో లింక్ చేయనున్నారు. దీనివల్ల కార్యకర్తలు తమకు ఎదురయ్యే సమస్యలను సులభంగా పార్టీకి తెలియజేయవచ్చు. ఇది పార్టీ కార్యకర్తలకు మరింత మద్దతుగా నిలుస్తుంది. ఈ యాప్ పూర్తి స్థాయిలో పనిచేస్తే వైసీపీకి ఒక కొత్త శకం మొదలైనట్లే.

Share your love