మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పొగాకు రైతులకు మద్దతుగా పోరాటాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రంలో పొగాకు వేలం ప్రక్రియ నెమ్మదించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తాను నేరుగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. పొగాకు రైతులకు అండగా నిలవడానికి పోరాటాన్ని తీవ్రతరం చేస్తానని స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy Tobacco Farmers Support
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో త్వరలో పర్యటించనున్నట్లు జగన్ తెలిపారు. అక్కడ పొగాకు రైతులను నేరుగా కలిసి వారి సమస్యలను అర్థం చేసుకుంటామని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో కూడా రైతులతో సమావేశం కానున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి ఈ పర్యటనలు సాయపడతాయన్నది వైసీపీ వ్యూహం. ప్రభుత్వం స్పందించకపోతే కందుకూరులో మరో పర్యటన కూడా చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 2332 మిలియన్ కిలోల పొగాకు పండినా ఇప్పటివరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారని జగన్ వివరించారు. సాధారణంగా వంద రోజుల్లో పూర్తి కావాల్సిన వేలం ప్రక్రియలో 94 రోజులు గడిచినా 16.5 శాతం మాత్రమే పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. సెప్టెంబర్లో కర్ణాటకలో వేలం ప్రారంభిస్తే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పొగాకు ధర రూ.200 తగ్గకూడదని చంద్రబాబు సమీక్షలో చెప్పిన మరుసటి రోజే మార్కెట్ ధరలు పడిపోవడం గమనార్హం. దీన్నిబట్టి సిండికేట్ ఎంత బలంగా పనిచేస్తుందో తెలుస్తుందని జగన్ విమర్శించారు. ఏ జిల్లాలో ఏ పంట రైతులకు ఇబ్బంది ఎదురైనా వైసీపీ వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని తాను ఎప్పుడూ చెప్పలేదని జగన్ స్పష్టం చేశారు.





