SKN: చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో జై ఎన్టీఆర్ నినాదాలు

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో జై ఎన్టీఆర్ నినాదాలు మార్మోగాయి. హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయవాడలో జరిగిన లవ్ కార్నివాల్ ఈవెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిర్మాత SKN మాట్లాడుతుండగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా నినాదాలు చేయడంతో ఆ క్షణం అందరి దృష్టినీ ఆకర్షించింది.

రాజ్ యువరాజ్ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో SKN తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, విజయవాడ తనకు ఇంద్రకీలాద్రి గడ్డ అని, ఇంద్ర సినిమా గుర్తుకు వస్తుందని అన్నారు. అయితే అక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా లేచి జై ఎన్టీఆర్, బెజవాడ అంటే సింహాద్రి గడ్డ అంటూ నినాదాలు చేశారు. ఈ సంఘటన తర్వాత SKN ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తన సొంత ఊరిలో సినిమా ఫంక్షన్ జరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించగా, సాయి రాజేష్ కథ అందించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై SKN, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. బీచ్‌లో భారీ లైట్ సెట్ హౌస్ నిర్మించబడింది.

జూలై 24వ తేదీన విడుదల కానున్న చెన్నై లవ్ స్టోరీకి జూలై 23 నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయని SKN తెలిపారు. ఈ తేదీ తనకు ఎంతో ప్రత్యేకమని, మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రాలు కూడా ఇదే తేదీన విడుదలయ్యాయని ఆయన అన్నారు. మెగా అభిమానిగా ఆ రోజు తనకు ఎంతో ప్రత్యేకమని, అదే రోజున చెన్నై లవ్ స్టోరీ విడుదల కావడం ఆనందంగా ఉందని SKN వ్యాఖ్యానించారు. అయితే ఈ ఈవెంట్‌లో జరిగిన ఎన్టీఆర్ నినాదాల సంఘటనపై నెటిజన్లు SKN ముఖం పరువు పోయినట్టు పెట్టాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share your love