సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై విరుచుకుపడ్డారు. కూటమి లేకుంటే ప్రజల ఆస్తులు దోచేసేవారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తప్పు చేసి ఉంటే, ప్రజల ఆస్తులన్నీ ఇప్పటికే దోచుకునేవారని ఆరోపించారు. మదనపల్లెలో జరిగిన భూ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత గొడ్డలి పార్టీ హయాంలో ప్రజలకు నరకం చూపించారని విమర్శించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వైసీపీ ప్రజల భూములను హైజాక్ చేయాలనుకుందని చంద్రబాబు ఆరోపించారు. ఆ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూముల మీద తమ ఫొటోలు వేసుకుని, రేపు ప్రజల భూములను తమవని టైటిల్ చేసుకుని అమ్మేసుకునే పన్నాగం పన్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములను గుర్తించి, నిజమైన లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. అందుకే ప్రతి 9వ తేదీన రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
2019లో వైసీపీ ప్రజలను మోసం చేసిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు నమ్మి ఓటేస్తే, వారి ఆస్తులు దోచుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక వేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూములు ఇస్తున్నామని, వాటిని డిజిటలైజ్ చేస్తున్నామని వివరించారు.
ప్రజలు కష్టపడి సంపాయించుకున్న ఆస్తిపై వారికే హక్కు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ వారిని ఆస్తులు దోచేసేవారు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్టీ నుంచి గొట్టాలను వెళ్లగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించాలని ప్రోత్సహించారు.





