బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం ఆయన బలమైన వాదనలు వినిపించారు. అలాగే తెలంగాణలో ప్రతి జిల్లాలో ఐటీ టవర్స్ ఉన్నా అవి ఐటీ కంపెనీలకు పనికి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు తమ జిల్లాల్లోనే ఐటీ జాబ్స్ పొందేలా చూడాలని కోరారు.
KT Ramarao railway division demand
కేటీఆర్ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఐటీ టవర్స్ నిర్మించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టవర్స్ బూతు బంగ్లాల్లా మారిపోయాయని ఆరోపించారు. హైదరాబాద్ లో గత 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలుండేవని ఇప్పుడు 9.39 లక్షలకు పడిపోయాయని లెక్కలు చెప్పారు. రెండేళ్లలో 7 వేల ఐటీ జాబ్స్ పోయాయంటే ఇది తీవ్రమైన పరిస్థితి అని అన్నారు.
రైల్వే డివిజన్ల విషయంలో కూడా కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులో 900 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ మాత్రమే ఉండగా అక్కడ డివిజన్ ఏర్పాటు చేశారు. కానీ కాజీపేటలో 2,000 కిలోమీటర్ల ట్రాక్ ఉన్నా ఇంకా డివిజన్ రాలేదని విమర్శించారు. కాజీపేటతో పాటు కొత్తగూడెంలో కూడా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం పాసిటివ్ గా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల అభివృద్ధికి కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతో అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ రంగంలోనూ గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు. త్వరలోనే కేంద్రం నుంచి పాసిటివ్ నిర్ణయం వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సహకరించాలని కేటీఆర్ కోరారు.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





