ఇంగ్లాండ్తో మూడో టీ20 మ్యాచ్కు ముందు టీమ్ఇండియాకు పెను షాక్ తగిలింది. 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ తీవ్రమైన గాయానికి గురయ్యాడు. ఈ ఘటనతో అతని ఆటపై సందేహాలు నెలకొన్నాయి.
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్ భారత్కు కీలకమైనది. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండో టీ20లో ఓటమి పాలైన టీమిండియా ఇప్పుడు గెలవాల్సిన తప్పని పరిస్థితిలో ఉంది. అయితే, వైభవ్ సూర్యవంశీ గాయపడటంతో జట్టు ప్రణాళికలకు ఎదురుదెబ్బ తగిలింది.
నెట్స్లో త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర ద్వివేది వేసిన షార్ట్ బాల్ను అంచనా వేయడంలో వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. ఆ బంతి నేరుగా అతని పక్కటెముకలకు బలంగా తాకింది. నొప్పితో అతను నేలపై కుప్పకూలిపోగా, వైద్య బృందం వెంటనే ప్రథమ చికిత్స అందించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుతానికి అతని గాయం తీవ్రతపై స్పష్టత లేదు. లోతైన గాయం అయితే నేటి మ్యాచ్లో అతను ఆడడం కష్టంగా ఉంది. ఆ పరిస్థితిలో సంజూ శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టీ20లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ రెండో మ్యాచ్లో కేవలం 14 పరుగులు చేసి నిరాశపరిచిన విషయం తెలిసిందే.




