హరీశ్ రావు కాళేశ్వరం జలాలు ప్రజల కంటికి కనిపిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాలు సిద్దిపేటకు రావడంతో ధాన్యం నిల్వలు పెరిగి గోదాములు నిండిపోయాయని, లారీలు దొరకని పరిస్థితి ఉందని ఆయన వివరించారు. కాంగ్రెస్ పాలన కమీషన్లతో నడుస్తోందని, గురుకులాల్లో కోడిగుడ్ల నుంచి రేడియం స్టిక్కర్ల వరకు ప్రతిచోటా లంచాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆరోపించారు.
గురువారం సిద్దిపేటలోని పటేల్ గార్డెన్లో లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా బీఆర్ఎస్పై బురద చల్లడమే కాంగ్రెస్ లక్ష్యంగా మారిందని విమర్శించారు. గతంలో రేడియం స్టిక్కర్ వెయ్యిరూపాయల్లోపే ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కింద 6-7 వేల వరకు ఖర్చు అవుతోందని వాహనదారులు తెలుపుతున్నారు.
హరీశ్ రావు తన వ్యక్తిగత ఖర్చులతో శిబిరంలో పాల్గొన్నవారికి కండ్ల అద్దాలు ఇప్పించడంతోపాటు, అవసరమైన కంటి ఆపరేషన్లు కూడా చేయిస్తానని ప్రకటించారు. అలాగే వ్యక్తిగత ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తానని తెలిపారు. ప్రజల ఆరోగ్యం ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంటుందని, నిత్యం వాకింగ్ మరియు యోగా చేయాలని సూచించారు.
రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్దిపేట లారీ అసోసియేషన్ కోసం ప్రత్యేకంగా లారీల పార్కింగ్ స్థలాన్ని కేటాయించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాళేశ్వరం జలాలు ఎంతో మంది రైతుల జీవితాలను మార్చేశాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమీషన్లపైనే దృష్టి పెడుతుందని విమర్శించారు.





