నాగబంధంతో విజయం ఖాయం అని నమ్మకంగా చెబుతున్నారు నటి ఐశ్వర్య మేనన్. ఎన్ఐఏ తెలుగు వైష్ణవిగా స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, భజే వాయు వేగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించకపోయినా, ఐశ్వర్య తనకంటూ ఒక అభిమాన బృందాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం నాగబంధం చిత్రంతో టాలీవుడ్లో మరోసారి ప్రయత్నం చేస్తున్న ఈ నటి, తన అలవాట్లను ఎవరికోసం మార్చుకోనని స్పష్టం చేశారు.
కేరళకు చెందిన ఐశ్వర్య మేనన్ కుటుంబం కొన్ని కారణాల వల్ల తమిళనాడులోని ఈరోడ్కు వలస వెళ్లింది. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటించాలనే కోరికతో ప్రయత్నించారు. చివరకు కోలీవుడ్లో అడుగుపెట్టారు. సంతోషం వచ్చినా, బాధ కలిగినా సోషల్ మీడియాలో పంచుకోవడం ఐశ్వర్య అలవాటు. అయితే, తన ఫొటోలు పోస్ట్ చేసిన సందర్భంలో చాలామంది బ్యాడ్ కామెంట్లు చేశారు. వారికి సమాధానంగా, తనను ఎవరు విమర్శించినా నా అలవాటును మార్చుకోను అని గట్టిగా చెప్పారు.
తెలుగులో తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఐశ్వర్య వచ్చినట్లు చెప్పారు. గతంలో నటించిన రెండు టాలీవుడ్ సినిమాలు విజయం సాధించకపోయినా, ఇక్కడ నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఓటమి తర్వాతే విజయం వస్తుందనే పాలసీనే తను ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. నాగబంధం సినిమా ప్రేక్షకులను ఆధ్యాత్మిక అడ్వెంచర్ ప్రపంచంలోకి తీసుకెళుతుందని ఆమె తెలిపారు. అనంత పద్మనాభ ఆలయంలోని నాగబంధం రహస్యాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వివరించారు.
విరాట్ కర్ణ, నభా నటేశ్లతో కలిసి నాగబంధంలో నటించడం అందమైన అనుభవమని ఐశ్వర్య పేర్కొన్నారు. తన అభిమాన నటుడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అని ఆమె చెప్పారు. ఆయనతో నటించాలనే కోరిక ఎప్పుడూ ఉండేది. బజూకా చిత్రంలో మమ్ముట్టితో కలిసి నటించే అవకాశం ఊహించని విధంగా వచ్చింది. ఆ అనుభవాన్ని ఎన్నటికీ మరచిపోలేనని ఐశ్వర్య వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో తన నటనకు మంచి స్పందన లభించింది. మొత్తంగా, నాగబంధంతో విజయం సాధించడం తన లక్ష్యమని ఐశ్వర్య మేనన్ స్పష్టం చేశారు.





