తమిళ సినిమా ప్రియులకు శుభవార్త. యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. తన సొంత నిర్మాణ సంస్థ PR షో బ్యానర్ తొలి చిత్రం ప్రకటనతో ఆయన సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు. లవ్ టుడే, డ్రాగన్ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు రాబట్టిన ప్రదీప్, తాజా చిత్రం LIK: Love Insurance Kompanyతో పెద్దగా ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా ఆయన ఈ కొత్త బాధ్యతతో ముందుకు దూసుకుపోతున్నారు.
PR షో అనే ఈ నిర్మాణ సంస్థ తొలి చిత్రంలో ప్రేమలు, డ్యూడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మమిత బైజు హీరోయిన్గా నటిస్తున్నారు. దర్శకుడిగా పేరుతెచ్చుకుని నటుడిగా మారిన అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే అనామిక మహి ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం కాగా, తెలుగు నటుడు శివాజీ సొంటినేని, నటి స్వాసిక ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ బ్యానర్ తొలి చిత్రం ప్రకటనతో సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రం మరో విచిత్రమైన ఆకర్షణ ఏమిటంటే, ఆరుగురు యువ దర్శకులు కలిసి ఫిల్మ్ మేకింగ్ చేయడం. వీరి బృందాన్ని ది ఆల్ఫా యూనిట్ అని పిలుస్తున్నారు. విశాల్ టీఆర్, యశ్ వి, నరేన్ సౌద, చాణక్యన్ ఆర్, ధనుష్ కుమార్, ఇళంపరితి ఈ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. కథను స్వయంగా ప్రదీప్ రంగనాథన్ అందించారు. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీ దినేష్ పురుషోత్తమన్, ఎడిటింగ్ ప్రదీప్ ఈ. రాఘవ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది. నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ కొత్త ప్రయాణం ఎలాంటి విజయాన్ని సాధించబోతుందో చూడాలి. ఈ బ్యానర్ తొలి చిత్రం ప్రకటన తమిళ సినీ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.





