పెద్దగా బాధ్యతలు ఉండని టీనేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేయని వారుండరు. అలా ఎంజాయ్ చేసిన అఖిల్ అనే కుర్రాడి కథే లిటిల్ హార్ట్స్. ఇంటర్ పూర్తై, ఎంసెట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న టైమ్ లో అఖిల్ లైఫ్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనే ఫన్నీ కథతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సాయి మార్తాండ్. ఈటీవీ విన్ కోసం 90’s ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా నటిస్తున్నారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ డిస్ట్రిబ్యూషన్ లో సెప్టెంబర్ 12న లిటిల్ హార్ట్స్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
లిటిల్ హార్ట్స్ టీజర్ ఎలా ఉందో చూస్తే – ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు అఖిల్ (మౌళి తనుజ్). పేరుకే చదువు గానీ టెంత్, ఇంటర్ లో అత్తెసరు మార్కులే వస్తాయి. చదువు మీద సీరియస్ నెస్ ఉండదు గానీ అల్లరి పనుల్లో ముందుంటాడు. కాత్యాయని(శివానీ నాగరం)ను ప్రేమిస్తాడు. లవ్ ప్రపోజ్ చేస్తే కాత్యాయని థ్యాంక్స్ చెప్పడం అఖిల్ కు అర్థం కాదు. చదువుకోమని తండ్రి (రాజీవ్ కనకాల) చెప్పే మాటల్ని అఖిల్ లైట్ తీసుకుంటాడు. వీధుల్లో గొడవలు, కాలేజ్ లో అఖిల్ చేసే అల్లరి పనులు, కాత్యాయనితో లవ్ స్టోరీ, ఇంట్లో తండ్రితో రోజూ తిట్లు..ఇవన్నీ ప్రేక్షకులు రిలేట్ అయ్యేలా ఉంటూ టీజర్ ఆకట్టుకుంది.





